గుంటూరు: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసును లాలాపేట పోలీసులు ఛేదించారు. బాలికను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కేసు సుఖాంతమైంది.

గుంటూరు ఈస్ట్ డీఎస్పీ టి. సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 17న సాయిబాబా కాలనీకి చెందిన బత్తుల కొండమ్మ (65) తన మనుమరాలు సాయి పల్లవి (4) కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లాలాపేట సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు బస్‌స్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
ఆర్టీజీఎస్ 360 కెమెరాల సాంకేతిక సాయంతో బాలిక బాపట్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాపట్ల రైల్వే స్టేషన్లో బాలిక ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో ఆమెను గుర్తించి సురక్షితంగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు.
విచారణలో బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆమెకు వరుసకు మేనమామ అయిన మనోజ్ కుమార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌కు సహకరించిన అతని భార్య షేక్ సుమయ్యను కూడా అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
బాలికను సురక్షితంగా ఆమె నాయనమ్మకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీసులు చేపట్టిన వేగవంతమైన చర్యలతో నాలుగేళ్ల బాలిక సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరింది.








