పోలవరం, సెప్టెంబర్ 23 (Y7 న్యూస్ తెలుగు): నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లా తొలి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా కె. చక్రవర్తి ఐపీఎస్ బుధవారం రంపచోడవరంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీకి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం పోలవరం జిల్లాకు ప్రత్యేక ఎస్పీ నియామకం జరగకపోవడంతో, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం కె. చక్రవర్తి ఐపీఎస్‌ను పోలవరం జిల్లా తొలి ఎస్పీగా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నట్లు సమాచారం. జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.







