E-PAPER

పాకిస్థాన్‌లో మరణహోమం..! మసీదు వద్ద ఆత్మాహుతి దాడి..! 16 మంది మృతి..!

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, కొహాట్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న ఒక మసీదును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఘోర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. వారంతపు ప్రార్థనల వేళ జరిగిన ఈ భయంకర సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది.

జుమా నమాజ్ కోసం భక్తులు, పలువురు పోలీసులు పెద్ద సంఖ్యలో మసీదుకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదు వద్దకు దూసుకొచ్చి పేల్చేసుకున్నాడు. ఈ భీకర పేలుడు ధాటికి అక్కడికక్కడే 16 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు వెలుపలి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రహరీ గోడ కూలిపోవడమే కాకుండా, సమీపంలోని ఇళ్లు, దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధింఛి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు, పేలుడు తర్వాత కూడా ఆ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు కొహాట్-హంగు రహదారిని మూసివేసి, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించనప్పటికీ, ఇటీవల కాలంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుంటున్న ‘తెహ్రీక్-యే-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP) ప్రమేయం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!