E-PAPER

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అక్టోబర్ 6న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన అరెస్ట్ కావడం కలకలం సృష్టించింది.

2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక పోరాటం సమయంలో చోటుచేసుకున్న ఒక పాత హత్య కేసుకు సంబంధించి పోలీసులు మిలన్ ప్రధాన్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. 2007 నందిగ్రామ్ ఉద్యమం మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన ఘట్టం. 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు ముగింపు పలికి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ పోరాటమే ఆనాడు పునాది వేసింది. ఆ తర్వాత 2011 నుండి వరుసగా పాలించిన తృణమూల్ ఆధిపత్యానికి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ చెక్ పెట్టింది.

శుక్రవారం కాళీఘాట్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మమత మాట్లాడుతూ నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ వర్గం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అంతకుముందు మమతా వర్గం తరఫున పోటీలో ఉన్న సంచితా ప్రధాన్ డే.. బెంగాల్ సీఎం సువేందు అధికారితో సమావేశమైన అనంతరం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాల్సిన పరిస్థితి దీదీకి ఎదురైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తోబుట్టువు పార్టీగా అభివర్ణించిన ఆమె.. ఇండియా కూటమిని బలపరిచే ఈ ఐక్యతా సందేశం బెంగాల్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ నేత షాకింగ్ రియాక్షన్

అయితే మమతా బెనర్జీ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి భిన్నంగా స్పందించారు. మమత ఏమైనా మాట్లాడుకోవచ్చని అయితే తమ పార్టీ ఆమె మద్దతును కోరలేదని స్పష్టం చేశారు. మొదట తన సొంత అభ్యర్థిని నిలబెట్టి.. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడంతోనే ఇప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము దీదీ నుంచి ఎలాంటి సాయం అడగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

బెంగాల్ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ రెండు చీలిపోయింది. దీంతో పార్టీకి అసలైన యజమాని ఎవరనే దానిపై వివాదం మెుదలైంది. అక్టోబర్ 6న జరిగే ఉపఎన్నికల దృష్ట్యా ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరును, పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేసింది. అనంతరం మమతా బెనర్జీ వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో పాటు ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. అలాగే అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరును, ‘ఉత్తరం’ గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!