సోషల్ మీడియా అంటే వినోదం, స్నేహాలు, అవకాశాలకు వేదికగా భావించే రోజులు మారిపోయాయి. ఇప్పుడు అంతర్జాతీయ నేర ముఠాలు అదే వేదికను యువతను నేరాల్లోకి లాగేందుకు ఉపయోగిస్తున్నాయి. ఒక మెసేజ్, ఆకర్షణీయమైన ఆఫర్, భారీగా డబ్బు వస్తుందన్న హామీతో సాధారణ యువకులను కిరాయి హత్యలకు పాల్పడేలా చేస్తున్న ఘటనలు యూరప్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ విధానం యూరోపియన్ పోలీసు సంస్థ యూరోపోల్ దృష్టిని ఆకర్షించింది.
యూరోపోల్ వెల్లడించిన వివరాల ప్రకారం, యూరప్‌లోని వ్యవస్థీకృత నేర ముఠాలు సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా టీనేజర్లను సంప్రదించి హత్యలు చేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇందుకోసం భారీ మొత్తాలను పారితోషికంగా ఇస్తామని హామీ ఇస్తున్నారు. అయితే నేరం చేసిన వెంటనే చాలా మంది యువకులు పోలీసులకు చిక్కిపోతుండటంతో, వారికి హామీ ఇచ్చిన డబ్బు చేతికి అందకుండానే జైలు పాలవుతున్నారు. దీంతో తాత్కాలికంగా కనిపించే డబ్బు ఆశ వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తోంది.
ఈ కొత్త నేర విధానాన్ని యూరోపోల్ ‘Violence as a Service’గా అభివర్ణిస్తోంది. ఇందులో నేర ముఠాలు స్వయంగా రంగంలోకి దిగకుండా ఆన్‌లైన్ ద్వారా యువతను రిక్రూట్ చేసుకుని, వారికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ నేరాలను అమలు చేయిస్తున్నాయి. వీడియో గేమ్ మిషన్‌ల తరహాలో ఆపరేషన్‌ను నిర్వహిస్తూ యువతను ప్రమాదకరమైన నేరాల్లోకి నెట్టేస్తున్నాయి. ‘Agent 47’ వంటి పేర్లతో చర్చకు వస్తున్న ఈ మోడల్.. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లను నేరగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే దానిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.









