అశ్వాపురం, జూలై 27 (వై7 న్యూస్): అశ్వాపురం గ్రామంలోని బీసీ హాస్టల్లో రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. హాస్టళ్లలో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయితే హాస్టల్ భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
అనంతరం అశ్వాపురం మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వివరించి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి రమేష్ బాబు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, హాస్టల్ సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








