ప్రతిరోజూ ఉదయం కాఫీతో రోజును ప్రారంభించే వారికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) శుభవార్త చెప్పింది. మితంగా కాఫీ తాగడం వల్ల శరీరానికి ఉత్సాహం అందించడమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేసే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు 8 ఔన్సుల పరిమాణంలో 2 నుంచి 4 కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, గుండె వైఫల్యం, స్ట్రోక్, టైప్-2 మధుమేహం, అలాగే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
అయితే రోజుకు 5 కప్పులకంటే ఎక్కువ లేదా 400 మిల్లీగ్రాములకంటే అధికంగా కేఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె వైఫల్యం ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కేఫిన్ వల్ల మాత్రమే కాకుండా, అందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాల వల్ల కూడా లభిస్తాయని వివరించారు.
కాఫీని ఎలా తయారు చేసుకుంటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అధికంగా చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్స్ కలిపిన కాఫీ ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తుందని సూచించారు. అలాగే ఫ్రెంచ్ ప్రెస్, టర్కిష్ కాఫీ వంటి ఫిల్టర్ చేయని కాఫీల్లో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెంచే సమ్మేళనాలు ఉండే అవకాశం ఉందని, అందుకే పేపర్ ఫిల్టర్‌తో తయారు చేసిన కాఫీని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.








