E-PAPER

బిస్లరీ వాటర్‌లో ప్రమాదకర బ్యాక్టీరియా..!

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్ చర్యలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతినిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా తెలీపారా ప్లాంట్ నుంచి సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం వారం వ్యవధిలోనే బిస్లరీ సంస్థపై ఆహార భద్రతా విభాగం ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

జల్‌పాయ్‌గురి ప్లాంట్ నుంచి సేకరించిన నమూనాలను తొలుత ప్రైమరీ ల్యాబ్‌లో, అనంతరం రెఫరల్ ల్యాబ్‌లో పరీక్షించగా రెండింటిలోనూ కోలిఫామ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. సాధారణంగా డ్రైనేజీ లేదా మురుగు లీకేజీలు, పగిలిన పైప్‌లైన్ల వల్ల నీటిలో ఈ బ్యాక్టీరియా చేరుతుంది. ఇంతకుముందు గోవా యూనిట్ నుంచి సేకరించిన శాంపిల్స్ సైతం నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అలాగే ఆగస్టు 12న కూడా నాణ్యతా లోపాల కారణంగా ఒక బ్యాచ్ నీటి విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధం విధించింది.

తాజాగా పరిశీలించిన నమూనాల్లో అనుమతించిన పరిమితికి మించి బ్రోమేట్‌తో పాటు పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (పీఏహెచ్) ఉన్నట్లు తేలింది. ఇవి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అధికారులు స్పష్టం చేస్తూ ఆ నీరు సురక్షితం కాదు అని ప్రకటించారు. సంస్థ విజ్ఞప్తి మేరకు రెండో ల్యాబ్‌లో పరీక్షించినా ఇదే ఫలితం రావడంతో న్యాయపరమైన చర్యలకు రంగం సిద్ధమైంది. అయితే తమ తాగునీరు పూర్తిగా సురక్షితమైనదని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని బిస్లరీ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆహార, పానీయాల తయారీ సంస్థలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముమ్మర తనిఖీలు చేపడుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!