ములుగు జిల్లా, నవంబర్ 16 | Y7 న్యూస్ తెలుగు:
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ములుగు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషనల్) బానోతు రవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీకి లేఖ రాసినట్లు కలెక్టర్ తెలిపారు.
సోమవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎంఆర్ గార్డెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ములుగు, వెంకటాపూర్ మండలాల లబ్ధిదారులకు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ములుగు ఎంపీడీవో ముందస్తు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కార్యక్రమం మధ్యలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారిక కార్యక్రమానికి ఆటంకం కలగడంతో పాటు మంత్రి, ప్రజల సమక్షంలో జిల్లా యంత్రాంగానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని కలెక్టర్ పేర్కొన్నారు.
అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయడం, కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచడంలో ఏఈ బానోతు రవి విఫలమయ్యారని కలెక్టర్ తెలిపారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారిపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
Y7 News Telugu | తెలంగాణ వార్తలు








