E-PAPER

ఉబర్‌లో భారీ డేటా లీక్..! వ్యక్తిగత డేటా బహిర్గతం..

ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్ మరోసారి డేటా బ్రీచ్‌తో వార్తల్లో నిలిచింది. తమ భాగస్వామ్య సంస్థ అయిన ‘ఫైర్‌వర్క్స్ ఏఐ’ వైఫల్యం కారణంగా డ్రైవర్లకు చెందిన కీలక వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు ఉబర్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో డ్రైవర్ల లైసెన్స్ వివరాలు కూడా బహిర్గతమైనట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫైర్‌వర్క్స్ ఏఐ సంస్థకు చెందిన ఇంటర్నల్ క్రెడెన్షియల్స్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించి, వాటి ద్వారా ఉబర్‌కు సంబంధించిన డేటాను యాక్సెస్ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 9న ఈ విషయాన్ని గుర్తించిన ఉబర్, వెంటనే ఫైర్‌వర్క్స్ ఏఐతో ఉన్న డేటా సంబంధాలను నిలిపివేసి, విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనలో మొత్తం ఎంతమంది ప్రభావితమయ్యారనే సంఖ్యను ఉబర్ వెల్లడించనప్పటికీ, అమెరికాలోని పలు రాష్ట్రాల అధికారులకు సమర్పించిన నివేదికల ప్రకారం వేలమంది డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఒక్క రోడ్ ఐలాండ్‌లోనే సుమారు 1,873 మంది ప్రభావితమైనట్లు సమాచారం.

ప్రభావితమైన వారికి 90 రోజుల పాటు ఉచితంగా క్రెడిట్ మానిటరింగ్, ఫ్రాడ్ సహాయాన్ని అందిస్తున్నట్లు ఉబర్ తెలిపింది. ఇప్పటివరకైతే లీకైన సమాచారం దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కంపెనీ స్పష్టం చేసింది. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచే క్రమంలో ఉబర్ ఈ ఏడాది జులైలో కస్టమర్ సర్వీస్ విభాగంలో 10 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన విషయం తెలిసిందే.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!