E-PAPER

కేంద్రం కీలక నిర్ణయం..! ప్రభుత్వ వాహనాలుగా ఎలక్ట్రిక్ కార్లు..!

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అధికారుల ఉపయోగం కోసం సమకూర్చే స్టాఫ్ కార్లలో ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకే (ఈవీ) తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాథమిక, ప్రాధాన్య ఎంపికగా (డిఫాల్ట్ అండ్ ప్రిఫర్డ్ ఛాయిస్) నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. మంత్రిత్వ శాఖలు, విభాగాలు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ కార్ల గరిష్ఠ డీలర్ ధర (నెట్ డీలర్ ప్రైస్) పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. గతంలో ఉన్న పరిమితితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అదే సమయంలో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వంటి సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్ (ఐసీఈ) వాహనాల గరిష్ఠ కొనుగోలు ధర పరిమితిని రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, మార్కెట్ పరిస్థితులు మరియు వాహనాల దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇకపై వివిధ శాఖల్లోని పాత ఐసీఈ కార్లను తొలగించినప్పుడు (కండెమ్నేషన్) లేదా వాటి స్థానంలో కొత్త వాహనాలను సమకూర్చుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవలం కొత్త వాహనాల కొనుగోలుకే కాకుండా, కార్యాలయ అవసరాల కోసం కార్లను అద్దెకు తీసుకునే సందర్భాల్లో కూడా ఈవీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022 సెప్టెంబర్ 1న జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అద్దె వాహనాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం లేదా కొనుగోలు ఆచరణాత్మకం కాదని భావిస్తే మాత్రం ఐసీఈ వాహనాల కొనుగోలుకు మినహాయింపు కోరే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, బలమైన కారణాలతో కూడిన ప్రతిపాదనను వ్యయ విభాగానికి పంపాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగం కార్యదర్శి ఆమోదం, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏకీభావం తప్పనిసరి. ఆయా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వ్యయ విభాగం మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటుంది. వాహనాల కొనుగోలు ప్రక్రియ మొత్తం జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్ఆర్) 2017 నిబంధనలకు లోబడి కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!