వైద్య సిబ్బందికి ఐటీడీఏ చింతూరు ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆదేశాలు
చింతూరు: శబరి నది వరద పరిస్థితుల నేపథ్యంలో ఐటీడీఏ చింతూరు ఇన్‌చార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ఎన్. విశ్వ చైతన్య వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వి.ఆర్.పురం మండలంలోని పెద్దమట్లపల్లి, ఏటపాక మండలంలోని నందిగామ, కూనవరం మండలంలోని టేకులబోరు, జగ్గవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన తనిఖీ చేశారు. వైద్య శిబిరాల్లో అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వరదల సమయంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని, బాగా ఉడికించిన వేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. దోమల నివారణకు దోమతెరలను తప్పనిసరిగా వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అవగాహన కల్పించారు.
అలాగే సీజనల్ వ్యాధులు, విరేచనాలు, పాముకాట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, విరేచనాల కేసులను గుర్తించి వెంటనే చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గర్భిణీలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు డా. విశ్వ చైతన్య తెలిపారు.








