గోద్రేజ్ అగ్రోవెట్‌కు భారీ నష్టం.. మరికొంత మంది కోసం గాలింపు
ఖమ్మం, సెప్టెంబర్ 27 (Y7 News Telugu): గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్‌కు చెందిన పామ్ ఆయిల్‌ను ట్యాంకర్ నుంచి అక్రమంగా మళ్లించి విక్రయించిన కేసులో ఖమ్మం పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మరికొంత మంది నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ మేనేజర్ వకలపూడి రామచంద్రరావు సెప్టెంబర్ 23న ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీకి చెందిన RBD పామ్ ఆయిల్ ట్యాంకర్ (AP39TU6599) సరుకు రవాణా సమయంలో డ్రైవర్ ఇతరులతో కలిసి కుట్ర పన్ని, ఆయిల్‌ను అక్రమంగా మళ్లించి విక్రయించడం ద్వారా కంపెనీకి ఆర్థిక నష్టం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ట్యాంకర్ యజమాని-డ్రైవర్ షేక్ కమరుద్దీన్ (A-1), కోడాడకు చెందిన ఆయిల్ వ్యాపారి కనకయ్య (A-2), ఆటో యజమాని-డ్రైవర్ బతిని గోపినాధ్ (A-3), కనకయ్య ఉద్యోగి **శ్రీనివాసరావు (A-4)**లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా సాగింది అక్రమ దందా
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ట్యాంకర్ మొదటి తూకం సమయంలో నీటి బాటిళ్లు, రాళ్లు వంటి వస్తువులు ఉంచి బరువు పెంచేవారని, అనంతరం ఆయిల్ లోడ్ చేసే ముందు వాటిని తొలగించేవారని పోలీసులు గుర్తించారు. రవాణా సమయంలో ట్యాంకర్ వాల్వులను మేనేజ్ చేసి కొంతమేర ఆయిల్‌ను బయటకు తీసి ఇతరులకు విక్రయించేవారని విచారణలో తేలింది.
సెప్టెంబర్ 22 రాత్రి ఖమ్మం శివారులో ట్యాంకర్ నుంచి ఆయిల్‌ను 31 కేన్లలో నింపి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లావాదేవీకి సంబంధించి A-2 కనకయ్య ఫోన్‌పే ద్వారా రూ.40 వేల అడ్వాన్స్ చెల్లించినట్లు ఆధారాలు లభించాయి.
సీజ్ చేసిన వస్తువులు
ఈ కేసులో పోలీసులు:
ఆయిల్ ట్యాంకర్ (AP39TU6599)
ఆటో (TS29T1812)
31 ఆయిల్ కేన్లు
4 మొబైల్ ఫోన్లు
నగదు
సీజ్ చేశారు.
రూ.9.30 లక్షల లావాదేవీలు గుర్తింపు
దర్యాప్తులో భాగంగా పరిశీలించిన ట్రాన్సాక్షన్ రికార్డుల్లో మొత్తం రూ.9,30,100 విలువైన చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు కమరుద్దీన్ అక్రమ విక్రయాల ద్వారా సుమారు రూ.1.50 లక్షలు, కనకయ్య కోడాడ, సూర్యాపేట ప్రాంతాల్లో అక్రమ మార్కెటింగ్ ద్వారా సుమారు రూ.5.50 లక్షల లాభం పొందినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఈ కేసులో ఫెరోజుద్దీన్, జయరాజు, చంటి, బాలాంజనేయులు బడినీడి, చౌదరి, నరేష్ ఆయిల్, కోడాడ ఆయిల్, కల్లూరు రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.








