విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన పాఠశాల యాజమాన్యం.. వివిధ పోటీల్లో చిన్నారుల ప్రతిభ
కరకగూడెం, నవంబర్ 14 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎక్సలెంట్ భాషా హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లు, పూలతో అందంగా అలంకరించగా, విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమను తాము ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోవద్దని, చిన్న వయసులోనే గొప్ప ఆలోచనలకు పునాది పడుతుందని అన్నారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పిల్లలపై చూపిన ప్రేమ, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం గర్వపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యతో పాటు మానవత్వానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పాఠశాల డైరెక్టర్ యాకుబ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కరకగూడెంలో ఎక్సలెంట్ కిడ్స్ స్కూల్‌ను ప్రారంభించామని తెలిపారు. తల్లిదండ్రుల ఆదరణ, నమ్మకంతో పాఠశాల హైస్కూల్ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు. చదువు అంటే కేవలం బట్టీ పట్టడం కాదని, విషయాలను అర్థం చేసుకుని తమకు నచ్చిన రంగాల్లో నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చని పేర్కొన్నారు.
డైరెక్టర్లు ముక్కు వెంకట నర్సారెడ్డి, బండారు నరేంద్ర మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఎంతో అవసరమని తెలిపారు.
బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు రన్నింగ్ రేస్, కబడ్డీ, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహిస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అంకం సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడంతో బాలల దినోత్సవ వేడుకలు ముగిశాయి.
– దిలీప్ కుమార్, కరకగూడెం మండల ప్రతినిధి, Y7 న్యూస్ తెలుగు









