టాలీవుడ్లో రాబోయే సంక్రాంతి సినిమాల విడుదల తేదీలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే జనవరి 12న శర్వానంద్ నటిస్తున్న ‘జార్జ్ క్రిష్’, మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ చిత్రం ‘కింగ్ 100’ కూడా సంక్రాంతి 2027 రేసులో ఉంటుందని ఇప్పటివరకు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మేకర్స్ ‘కింగ్ 100’ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా 2026 డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే డిసెంబర్లో విడుదల చేసినా నాగార్జున సినిమాకు పోటీ ఏమాత్రం తక్కువగా ఉండదు. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కానుండగా, నందమూరి బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK111’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ‘కింగ్ 100’ కూడా డిసెంబర్ బరిలోకి దిగితే 2026 చివరి నెలలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఒకే నెలలో ఇలా పెద్ద సినిమాలు వరుసగా విడుదల కావడం పరిశ్రమకు కూడా సానుకూల పరిణామమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి సీజన్లో సినిమాల మధ్య పోటీ తగ్గడంతో పాటు, డిసెంబర్లో స్టార్ హీరోల చిత్రాలు వరుసగా వస్తే థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది.









