ఒకప్పుడు బడ్జెట్ ఫోన్ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన నోకియా ఆశా సిరీస్ ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వచ్చింది. HMD Global రూపొందించిన HMD Asha 305 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. పాత Nokia Asha ఫోన్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ 4G కనెక్టివిటీతో పాటు ఆధునిక ఫీచర్లను ఇందులో అందించారు. డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా, కనెక్టివిటీ వంటి అంశాల్లో పాత మోడళ్లతో పోలిస్తే ఈ ఫోన్లో గణనీయమైన మార్పులు చేశారు.
HMD Asha 305ను ప్రస్తుతం ఫిలిప్పీన్స్ మార్కెట్లో విడుదల చేశారు. ఈ ఫోన్ ధర PHP 3,990, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.6,225గా ఉంటుంది. గ్రీన్, బ్లాక్ అనే రెండు రంగుల ఎంపికల్లో ఈ డివైస్ అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో విడుదలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా, త్వరలో మరిన్ని మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బడ్జెట్ ధరలో 4G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను ఆకర్షించే లక్ష్యంతో HMD ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. ధర పరంగా చూస్తే Infinix, itel, Tecno వంటి బ్రాండ్ల ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్లో HMD Asha 305 మరో ఆసక్తికరమైన ఎంపికగా మారనుంది.









